వరద సాయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి గారు మరో సారి తన ఉదార హృదయాన్ని చాటుకున్నారు. గత కొద్ది రోజులుగా కుండపోత వర్షం కారణంగా వరదలు పోటెత్తిన నేపథ్యంలో తన వంతు సాయంగా కోటి రూపాయల విరాళాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించారు.

ఈ సందర్భంగా చిరంజీవి తన భావాలను ట్విట్టర్ లో ఈ విధంగా పంచుకున్నారు. "గడిచిన వందేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి బీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రీలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వాళ్ళని చేయమని ఈ సందర్భంగా కోరుతున్నాను."

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్పందించి తన వంతు సాయం చేయడం ఇది మొదటి సారి ఏం కాదు. ఇటీవలే కరోనా సమయంలో కోటి రూపాయలు ఇరు తెలుగు రాష్ట్రాలకు అందించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ ఆపద సమయాల్లో ఆలస్యం లేకుండా స్పందిస్తున్న చిరంజీవి గారు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుందాం.

Related