ప్రాణాయామం

ప్రాణం + ఆయామం = ప్రాణాయామం. ప్రాణం అంటే జీవ శక్తి. ఆయామం అంటే విస్తరింప చేయడం. ప్రాణాయామం అంటే జీవ శక్తిని పెంపొందించుకోవడం అని చెప్పవచ్చు.


పతంజలి మహర్షి యోగ సూత్రాల ప్రకారం ఉచ్ఛ్వాస (ఊపిరి తీసుకోవడం), నిశ్వాశ (ఊపిరి వదలడం) లను అదుపులో ఉంచుకోవడాన్ని ప్రాణాయామం అంటారు.


మన శరీరంలో సుమారు 72000 నాడులు వాయు సంచార యోగ్యంగా ఉన్నాయి. అందులో ఇడ (చంద్ర), పింగళ (సూర్య), సుషుమ్న నాడులు ప్రధానమైనవి. ముక్కు కుడి రంధ్రం సూర్య నాడికి, ముక్కు ఎడమ రంధ్రం చంద్ర నాడికి సంకేతం. ముక్కు మధ్య భాగంలో సుషుమ్న నాడి కలదు. ఈ విషయం తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి.



స్థితులు


  1. పూరకం - ఊపిరితిత్తుల నిండుగా గాలి తీసుకోవడాన్ని పూరకం అంటారు.
  2. రేచకం - ఊపిరితిత్తుల నిండుగా పీల్చిన గాలిని వదలడాన్ని రేచకం అంటారు.
  3. కుంభకం - ఊపిరి పీల్చడం కాని, వదలడం కానీ చేయకుండా ఆపి ఉంచే స్థితిని కుంభకం అంటారు. ఇది రెండు రకాలు:
    • అంతః కుంభకము - పూరకం తర్వాత బంధన స్థితిని అంతఃకుంభకం అంటారు.
    • బాహ్య కుంభకం - రేచకం తర్వాత గాలిని పీల్చకుండా ఉండే స్థితిని బాహ్యకుంభకం అంటారు.

పూరకం : అంతఃకుంభకం : రేచకం : బాహ్యకుంభకం : ప్రక్రియలు వరుసగా 1 : 4 : 2 : 1 నిష్పత్తిలో ఉండాలి. అనగా పూరకం సమయం 5 సెకనులు అయితే, అంతఃకుంభకం 20 సెకనులు ఉండాలి, రేచకం 10 సెకనులు ఉండాలి, బాహ్యకుంభకం 5 సెకనులు ఉండాలి.


పూరకం తొందరగా చేసినా పర్లేదు కాని, రేచకం సాధ్యమైనంత నెమ్మదిగా చేయాలి. లేదంటే శరీరంలో నిస్సత్తువ ఆవరిస్తుంది.



ప్రయోజనాలు


  • శరీరానికి ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుంది.
  • శరీరంలోని వ్యర్థ వాయువులు బయటికి వెళ్లిపోతాయి.
  • ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి.
  • రక్తశుద్ధి జరిగి ఆరోగ్యంగా ఉంటారు.
  • గుండెకి, శరీరానికి బలం చేకూరుతుంది.
  • మెదడు ఉత్తేజితమై చురుగ్గా పని చేస్తుంది.
  • దీని వలన మనిషి ఆయుర్దాయం పెరుగుతుంది.


ప్రాణాయామం గురువు పర్యవేక్షణ లేకుండా అధికంగా చేయడం ప్రమాదకరం (శరీరం, మెదడు అధికంగా ఉత్తేజితం అయ్యి, నియంత్రణ కోల్పోయి పిచ్చి పట్టే అవకాశం ఉంది).

హెచ్చరిక


చేయు విధానం


  • ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక చేయాలి (స్నానం తప్పని సరి కాదు).
  • ఉదయం 4 నుంచి 7 గంటల మధ్యలో చేయాలి (4 నుంచి 5 గంటలు ఉత్తమ సమయం).
  • పరగడుపున చేయాలి (కడుపు నిండుగా ఉన్నపుడు చేయకూడదు).
  • చేయు ప్రదేశం గాలి వెలుతురు పుష్కలంగా లభించే ప్రదేశం అధిక ఫలితాన్ని ఇస్తుంది.
  • నేల మీద ఒక మందపు వస్త్రాన్ని పరిచి (తివాచీ లాంటిది) దాని మీద చేయాలి. ఒట్టి నేలపై కాని, మంచాల మీద కాని చేయకూడదు.
  • వదులు దుస్తులు ధరించి చేయాలి.
  • సుఖాసనం, పద్మాసనం, వజ్రాసనంలో ఉండి ప్రాణాయామం చేయాలి.
  • నడుము నుంచి తల వరకు నిటారుగా ఉండి చేయాలి.
  • అధికంగా చేయకూడదు (ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది కలిగేంత చేయకూడదు).

Related