దుబాయ్ లో కప్ కొట్టిన ముంబాయ్

ముంబై ఇండియన్స్ ఐదోసారి ఇండియన్ ప్రీమయర్ లీగ్ లో కప్ కొట్టి సత్తా చాటుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. గతంలో ఐపీయల్ లో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019 లలో విజేతగా నిలిచింది. కాగా ప్లే ఆఫ్స్ లో టాప్ లో ఉన్నా, సరి సంవత్సరం అనే సెంటిమెంట్ తో ముంబై కప్ గెలవదు అని ప్రచారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దాన్ని వమ్ము చేస్తూ నిలకడ ప్రదర్శనతో ఛాంపియన్ టీమ్ అని నిరూపించుకుంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. స్టోయినిస్ (0) డక్ ఔట్ కాగా, ధావన్ (15), రహానే(2) విఫలం అయ్యారు. శ్రేయాస్ అయ్యర్ (65), రిషబ్ పంత్ (56) విజృంభణ తో ఎట్టకేలకు 158 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. కాగా ముంబై బౌలర్లు బౌల్ట్ 3, కౌల్టర్-నైలు 2, జయంత్ యాదవ్ 1 వికెట్ తీసుకున్నారు.

తరువాత బ్యాటింగ్ చేసిన ముంబై, కెప్టెన్ రోహిత్ శర్మ 68 పరుగులు చేసి విజృంభించాడు. అందులో 4 సిక్సర్లు కూడా ఉన్నాయి. క్వింటన్ డి కాక్ (20), సూర్యకుమార్ యాదవ్ (19), ఇషాన్ కిషన్ (33) పరుగులు చేసి విజయాన్ని సునాయాసం చేశారు.

ఇప్పటి వరకు జరిగిన 12 ఐపియల్ సీజన్లలో ఫైనల్ చేరుకోని ఢిల్లీ టీమ్ మొదటి సారి ఫైనల్ చేరుకున్నా నిరాశే ఎదురైంది. కుర్రాళ్ళ టాలెంట్ తో అనూహ్యంగా రాణించి ఫైనల్ కు చేరుకుని ఓటమి పాలైన ఢిల్లీ టీమ్ కు సానుభూతి తెలుపుతూ వారి పోరాట పటిమను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. అలాగే అయిదో సారి ఫైనల్ లో విజయం సాధించిన ముంబై టీమ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

Related