మన భారతీయ సంస్కృతి ప్రకారం మనకి మొత్తం 8 దిక్కులు ఉన్నాయి. వీటిని అష్ట దిక్కులు అని అంటారు. అలాగే ఈ దిక్కులతో పాటు భూమి మరియు ఆకాశాలను కలుపుకుంటే మొత్తం 10 ఉంటాయి, వీటిని దశ దిశలు అంటారు. ఒక్కో దిక్కుకి ఒక్కో అధిపతి ఉంటారు. వారి భార్య, నివాస పట్టణం, వాహనం మరియు ఆయుధం మొదలగు తదితర వివరాలను కింది పట్టిక్కలో పేర్కొనడం జరిగింది.
దిక్కు | దిక్పాలకులు | ది.పా. భార్య | ది.పా. పట్టణం | ది.పా. వాహనం | ది.పా. ఆయుధం |
---|---|---|---|---|---|
తూర్పు | ఇంద్రుడు | శచీ దేవి | అమరావతి | ఏనుగు/ఐరావతం | వజ్రము |
ఆగ్నేయం | అగ్ని | స్వాహా దేవి | తేజోవతి | తగరు/పొట్టేలు | శక్తి |
దక్షిణం | యముడు | శ్యామలా దేవి | సంయమని | మహిషము | దండము |
నైరుతి | నైరుతి | దీర్ఘాదేవి | కృష్ణాంగన | గుర్రము | కుంతము/ఈటె |
పడమర | వరుణుడు | కాళికాదేవి | శ్రద్ధావతి | మకరం/మొసలి | పాశం |
వాయువ్యం | వాయువు | అంజన | గంధనవతి | లేడి | ధ్వజము |
ఉత్తరం | కుబేరుడు | చిత్రలేఖ/రే | అలకాపురి | నరుడు | ఖడ్గము |
ఈశాన్యం | ఈశ్వరుడు | పార్వతి | యశోవతి | వృషభము/నంది | త్రిశూలము |
సాధారణంగా సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పుగా, సూర్యుడు అస్తమించే దిక్కుని పడమర గా మనం పరిగణిస్తాం. భౌగోళిక చిత్ర పటాల దృష్ట్యా తూర్పు కుడి పక్క, పడమర ఎడమ పక్క, ఉత్తరం పై వైపు, దక్షిణం కింద వైపు ఉంటాయి. ఈ దిక్కులను దిక్సూచి అనే పరికరం ఆధారంగా మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దిక్కులను గుర్తించవచ్చును. ఇది అయస్కాంత ధ్రువాల ఆధారంగా పని చేస్తుంది.
తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ నాలుగింటిని ప్రధాన దిక్కులని పిలుస్తారు. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం లను మధ్యమ దిక్కులుగా పిలుస్తారు.
మన సంస్కృతిలో దిక్కులకు ప్రముఖ ప్రాధాన్యం ఇవ్వబడింది. పూజలకు, గృహాలకు, ప్రయాణాలకు ఇలా అన్నీ రకాల కార్యాలకు దిక్కుల ఆధారంగా ఆయా కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి.