ఎస్ పీ బీ (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ఈ పేరు తెలియని సంగీత పిపాసి ఉండడు అంటే అతిశయోక్తి కానే కాదు. దాదాపు 55 సంవత్సరాలు తన గాత్రంతో సంగీత ప్రియులని ఆనందింపజేసిన గొంతు ఇప్పుడు మూగబోయింది. గాయకుడిగానే కాక సంగీత దర్శకుడిగా, నటుడిగా, గాత్రదాతగా, వివిధ కార్యక్రమాల న్యాయ నిర్ణేతగా తనదైన ముద్ర వేసుకున్న బాలు నెల్లూరు జిల్లాలో జన్మించారు. కోదండపాణి గారి సహాయంతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈయన ఇక వెనుదిరిగి చూడలేదు.
కేవలం సంగీతానికే కాకుండా భాషకి, ఉచ్ఛారణకి గౌరవం ఇచ్చే అతి కొద్దిమంది గాయకుల్లో బాలు ముందు వరుసలో ఉంటారు. ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమంలో ఆయన చెప్పే విషయాలు అక్షరం మీద ఆయనకున్న మక్కువను తెలుపుతాయి. బహుభాషా గాయకులు ఎంతమంది ఉన్నా, అన్ని భాషలను నేర్చుకొని ఎటువంటి ఉచ్ఛారణ దోషాలు లేకుండా పాడే ఏకైక గాయకుడు బాలు. ఆయన ఆఖరి శ్వాస వరకు తెలుగు భాష కోసం తపించిపొయేవారు. అందుకే సిరివెన్నెల గారు, ఎస్.పీ.బి. కి సంతాపం తెలుపుతూ, బాలు తర్వాత ఇంకో గాయకుడు వస్తాడేమోగాని భాష గురించి చెప్పే గొంతు లేదని కన్నీరు పెట్టుకున్నారు.
అలసిపోయన తరంగంలా, వలస పోయిన విహంగంలా, తరలిపోయిన ఓ రసాంతరంగమా, సంగీతానురాగ తరంగమా, మరలిరా మరుజన్మలా, లాలి పాటల అమ్మలా, కమ్మనైన ప్రేమ పాటల తన్మయత్వపు జల్లులా, పదపుయదలో కలిగినట్టి ధన్యతత్వపు వెల్లులా, నిన్ను మోసిన ఈ ఇల పులకరించు ఓ మనిషిలా, మిన్ను తాకి మేఘమాలని పలకరించగల ప్రగతిలా, మరలిరా !!
ప్రసాద్ సి హెచ్
'ప్రతి రోజు ఆయన పాట వినని తెలుగు లోగిలి ఉండదు' అంటే అతిశయోక్తి కానే కాదు. ఏ దివిలో విరిసిన అని ప్రేమికుడిగా మారినా, కుర్రాళ్ళోయ్ అంటూ కుర్రకారుని ఉరకలెత్తించినా, ప్రేమ విఫలం అయిన భగ్న ప్రేమికుడిగా మారి ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అని పాడినా, శంకర శాస్త్రిలా మారి శంకరాభరణం వినిపించినా అది ఆయనకే చెల్లుతుంది. బాలు-ఇళయరాజా ద్వయం సృష్టించిన పాటలన్నీ అధ్భుతాలే. 80వ దశకంలోకి వెళ్తే చాలా మంది సంగీత దర్శకులు ఉన్నారెమో గాని, ఆ పాటల చమక్కులన్నీ పలికే గొంతు మాత్రం బాలుదే.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ కలిపి మొత్తం 16 భాషలలో ఆయన పాడిన 40 వేల పాటలకు గాను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. ఇన్ని పాటలు పాడే మీకు సాధన చేసే సమయం ఉంటుందా అని అడిగితే ఆయన చెప్పిన జవాబు నాకు వచ్చే పాటలే నా సాధన అని. ఒకే రోజులో 21 పాటలు రికార్డ్ చేసిన ఘనత అయన సొంతం!! అలుపు లేకుండా సాగిన అయన పాటల ప్రయాణం నేటి యువ గాయకులకు ఎంతో ఆదర్శం.
6 జాతీయ అవార్డులు, 25 నంది అవార్డులు, వివిధ రాష్ట్రాల అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ, ప్రద్మభూషణ్ అవార్డులను అందుకొన్నారు. ఆయన భౌతికంగా మనల్ని వదిలినప్పటికీ, అయన పాటలు చిరస్థాయిగా మన మనసుల్లో జీవితాంతం నిలిచిపొతాయి.