థైరాయిడ్ అనేది మన శరీరం లోని ఒక గ్రంధి. ఇది మన జీవక్రియలకు సహకరించే హార్మోన్స్ లను విడుదల చేస్తుంది. ఇది గొంతు ముందు భాగంలో రెండు అంగుళాల పరిమాణంలో ఆహార వాహికకు చుట్టుకుని ఉంటుంది.
పని తీరు
ఈ గ్రంథి మనం తినే ఉప్పులో ఉండే అయోడిన్ ను గ్రహించి, కొన్ని హార్మోన్లను విడుదల చేస్తుంది. అందులో టీ3 (ట్రైఅయోడోథైరాయిన్) మరియు టీ4(థైరాక్సిన్) ప్రధానమైనవి. సాధారణంగా ఈ గ్రంథి 20% టీ3, 80% టీ4 లను విడుదల చేస్తుంది. టీ3, టీ4 ల ఉత్పత్తి అధికంగా తగ్గితే దాని హైపో థైరాయిడిజం అని, అధికంగా పెరిగితే హైపర్ థైరాయిడిజం అని అంటారు.
మన శరీరంలో టీ3, టీ4 ఉత్పత్తి స్థాయి పడిపోయినప్పుడు, మన మెదడులో ఉండే పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ ఉత్ప్రేరక హార్మోన్లను విడుదల చేసి థైరాయిడ్ గ్రంధి సమతుల్యతకు సహకరిస్తుంది.
థైరాయిడ్ సమస్య పురుషులలో కన్నా అధికంగా స్త్రీలలో అధికంగా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
హైపో థైరాయిడిజం లక్షణాలు
- మల బద్ధకం
- పొడి శరీరం, గోళ్ళు పగుళ్లు రావడం
- జుట్టు రాలడం
- నిద్ర సమస్యలు
- బరువు పెరగడం
- గుండె వేగం తగ్గడం
- నీరసంగా ఉండటం
- కండరాల తిమ్మిరి, గొంతు బొంగురు పోవడం
- జ్ఞాపక శక్తి క్షీణించడం
- శీతలవాతావరణం తట్టుకోలేక పోవడం
హైపర్ థైరాయిడిజం లక్షణాలు
- చెమట ఎక్కువగా పట్టడం
- చిరాకు, భయం, మానసిక మార్పులు
- అధికమైన ఆకలి, దాహం, అలసట
- కళ్ళు పొడిబారడం, ఎర్రబడడం
- బరువు తగ్గడం
- గొంతు దగ్గర వాపు (గాయిటర్)
- క్రమరహిత/స్వల్పకాలిక ఋతుస్రావం
- గుండె వేగం పెరగడం
- వేడిని వాతావరణం తట్టుకోలేక పోవడం
నివారణలు
- ప్రతి రోజూ పెరుగు తినాలి
- వెల్లుల్లి, పాలకూరలు
- పచ్చి బఠానీలు, బాదం పప్పులు
- గుడ్లు, చేపలు, రొయ్యలు, పుట్ట గొడుగులు
- ధూమపానానికి దూరంగా ఉండాలి
- యోగాభ్యాసం చేయాలి (హలాసనం, మత్స్యాసనం)
- ప్రాణాయామం చేయాలి (రక్త శుద్ధి, జీవ క్రియకు ఉత్తమ మార్గం)
- వైద్యుని సలహా మేరకు పరగడుపున ఒక మాత్ర సరైన మోతాదులో తీసుకోవాలి
- నియంత్రణ కోల్పోయినట్లు అయితే తక్షణమే వైద్యుని సంప్రదించాలి.