భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, నెల్లూరు జిల్లా, గొలగమూడి గ్రామమందు కొలువై ఉన్నారు. ఈ దేవాలయం ముఖ్యంగా శనివారము భక్తులతో కోలాహలంగా ఉంటుంది. భక్తులతో కిటకిటలాడుతోంది అని చెప్పడం కంటే కళకళలాడుతుంది అని చెప్పవచ్చు. వెంకయ్య స్వామిని భక్తులు కలియుగ దైవంగా భావించి, స్వామి వారి తెలుపు రంగు దారాన్ని తమకు రక్షణగా ధరిస్తారు.


ఈ గుడిలో నిత్యాన్నదానం, నిత్యాగ్నిహోత్రం ప్రత్యేకత. రోజులో రెండు పూటలా, మధ్యాహ్నం మరియు సాయంత్రము అన్నదానం జరిగే అతి అరుదైన దేవాలయాల్లో ఒకటి. అగ్నిహోత్రాన్ని స్వామి వారు గురువుగా భావించేవారు. అందుకని ఇక్కడ ఎల్లప్పుడూ నిరంతరాయంగా అగ్ని భాసిల్లుతూ ఉంటుంది. దేవాలయం ఎదురుగా భజన మందిరం కలదు. ఇందులో వెంకయ్య స్వామి వారు తమ భక్తులకు ఉపదేశించిన "ఓం నారాయణ ! ఆది నారయణ !!" అను మంత్రము అనునిత్యం అనేక రాగ తాళ మేళాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. స్వామి వారిని విశేషంగా పూజించి సేవించిన కొందరు భక్తుల (తులసమ్మ గారు, రోశి రెడ్డి గారు, వక్కెమ్మ గారు, అక్కిం వెంకట రామిరెడ్డి గారు, ఆది నారాయణ రెడ్డి గారు, కోమరగిరి రమణయ్య గారు, బరిగెల నాగయ్య గారు, గుత్తా నరసమ్మ గారు) సమాధులు ఆలయ ప్రాంగణంలో కలవు. అంతేగాక పూర్వ జన్మ పాపాలను హరించే త్రిమూర్తుల ప్రతిరూపమైన రావి చెట్టు కూడా కలదు. ఒక్క గొలగమూడిలోనే కాకుండా నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో వెంకయ్య స్వామివారి దేవాలయములు దర్శనమిస్తాయి.


స్వామి వారు అన్ని జీవులయందు విశేష కృప కలిగిన దయార్ద్ర హృదయులు. స్వామి వారు తమ నోటి మాటతో పెన్నా నది ప్రవాహ ప్రళయం నుండి 100 సంవత్సరాల వరకు నెల్లూరును తప్పించి అభయహస్తం ఇచ్చారు. స్వామివారి జీవిత విశేషాలు సమగ్రంగా తెలుసుకోవాలనుకునే భక్తులకు "అవధూత లీల" అనే పుస్తకం సిఫార్సు చేయుచున్నాము. ఈ పుస్తకం అతి తక్కువ ఖర్చుతో ఆలయంలో మరియు ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చు. స్వామి వారి లీలలు ప్రత్యక్షంగా వీక్షించిన వారు అనేక వేల మంది కలరు. వారు అల్లు భాస్కర్ రెడ్డి గారు యూట్యూబ్ వేదికగా చేపట్టిన "శ్రీ స్వామి భక్తుల సత్సంగం" కార్యక్రమంలో తమ అనుభవాల్ని యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నారు.


ఈ ఆర్టికల్ ముఖ్యంగా వెంకయ్య స్వామి వారి భక్తుల కొరకు కంటే, వెంకయ్య స్వామి వారి గురించి తెలియని వారికి తెలియజేసే సదుద్దేశంతో వ్రాయబడింది. ఒక విషయం చెప్పాలని నాకు తోచుతుంది. అది ఏమిటంటే ఈ దేవాలయంలో ఎవరైనా భక్తులు ధనాన్ని పూజ సమయంలో (ఎప్పుడైనా) అర్చకులకు అందించిన యెడల వారు తాము తీసుకోకుండా హుండీకి సమర్పించడం అనేక సార్లు ప్రత్యక్షంగా వీక్షించాను. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాను అంటే చాలా చోట్ల అడిగి మరీ సేవకు ప్రతిఫలంగా, ఎదుటి వారి పరిస్థితి పట్టించుకోకుండా ధనాన్ని ఆశిస్తారు. కానీ ఇక్కడ ఇలా చేయడానికి కారణం తమకు కావల్సింది స్వామి వారే ఇస్తారు అనే నమ్మకంతో కావొచ్చు లేదా స్వామి సేవని మాత్రమే ఆశించే ఉద్దేశంతో కావొచ్చు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారైనా ఈ దేవాలయంను సందర్శించి స్వామి వారి దీవెనలు పొందవలసిందిగా మనవి. స్వామి వారు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుగాక !


ముగిస్తూ ఒకసారి "ఓం నారాయణ ! ఆది నారాయణ !!".


Related