దీపావళి : ప్రాముఖ్యత, విశేషాలు

భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ఇది తెలుగు మాసాల ప్రకారం ఆశ్వయుజ అమావాస్య రోజు జరుపుకుంటారు

దీపావళి (దీప + ఆవాళి) అనగా దీపముల వరుస అని అర్థం.

ఈ పండుగను నరకాసురుడు అనే రాక్షసుడిని, సత్యభామ వధించడం వల్ల ఆ తరువాత రోజును దీపావళి గా జరుపుకుంటారు. అంతే గాక విజయ దశమి నాడు జరిగిన రావణ సంహారం తర్వాత, తిరిగి అయోధ్యకు ప్రయాణమైన సీతారాములు సరిగ్గా 21 రోజుల తర్వాత ఇదే రోజున అయోధ్యకు చేరుకుంటారు. ఈ రోజున అయోధ్యలోని ప్రజలు దీపావళి జరుపుకున్నారని అంటారు. (మనం గూగుల్ మాప్స్ లో చూస్తే, లంక నుంచి అయోధ్యకు కాలి నడక సమయం సుమారు 21 రోజులు).

నరకాసుర వధ

పూర్వం కృత యుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో నరకుడు జన్మిస్తాడు. నరకుడు తర్వాత కాలంలో ప్రజలను పీడిస్తూ అనేక బాధలకు గురి చేస్తాడు. అయినా నరకుని మహా విష్ణువు వధించరాదని, తన చేతిలోనే మరణం పొందాలని భూదేవి వరం పొందుతుంది.

ద్వాపర యుగంలో భూదేవి అంశతో సత్యభామ, మహావిష్ణువు అంశతో ఉన్న శ్రీ కృష్ణుడిని పతిగా పొందింది. అప్పటికే నరకాసురుని చర్యలు మితి మీరడంతో శ్రీ కృష్ణుడితో సహా వెళ్లిన సత్యభామ, నరకాసురుని వధిస్తుంది. ఎంతైనా తన పుత్రుడు కావడంతో నరకుని పేరు కలకాలం నిలిచిపోవాలనే కోరికను కోరగా, నరకుని వధించిన రోజు నరక చతుర్దశిగా ఖ్యాతి గడిస్తుందని వరం ప్రసాదిస్తాడు.

అప్పుడు నరకునికి బంధీలుగా ఉన్న అనేక మంది ప్రజలు, పదహారు వేల మంది గోపికలు విముక్తులవుతారు. వారి బాధ్యతను కృష్ణుడు తీసుకుంటాడు. అప్పటి కాలం దృష్ట్యా భరించేవాడు భర్త కావున, ఆ గోపికలకు కృష్ణుడు భర్త అయ్యాడు కాని వారికి వివాహం జరిగిందని కాదు.

ఆ తర్వాత రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలడానికి, దీపాలు వెలిగించి, బాణాసంచాలతో ఉత్సవం జర్పుకున్నారు. అది నేడు దీపావళిగా పిలవబడుతుంది.

లక్ష్మి పూజ

పూర్వం దుర్వాసుడు అనే మహర్షి, దేవేంద్రుని ఆతిథ్యానికి మెచ్చి ఒక హారాన్ని బహూకరించగా, దాన్ని దేవేంద్రుడు ఐరావతం అనే ఏనుగు మెడలో వేయగా, అది ఆ హారాన్ని కింద పడేసి తొక్కేయడం చూచిన కోపించిన మహర్షి దేవేంద్రుని శపించగా, ఇంద్రుడు తన త్రిలోక ఆధిపత్యాన్ని కోల్పోతాడు.

ఇంద్రుడు మహా విష్ణువును మొర పెట్టుకోగా, ఒక జ్యోతిని వెలిగించి, మహాలక్ష్మి రూపంగా పూజించమని విష్ణువు చెప్పగా, ఇంద్రుడు అలాగే చేసి తన త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. అందువల్ల జ్యోతి రూపంలో ఉన్న మహాలక్ష్మిని పూజిస్తే సకల వరాలు ఇస్తుందని నమ్మకం. అందుకే దీపావళి రోజు మహా లక్ష్మి దేవి పూజ ప్రత్యేకంగా పరిగణించబడుతుంది.

నేటి సంబరాలు

నేడు ప్రజలు ఉదయాన్నే లేచి మంచిగా ముస్తాబు అయ్యి దేవునికి పూజ చేస్తారు, ముఖ్యంగా మహా లక్షి దేవికి. తర్వాత ఉదయం మధ్యాహ్నం వెలుతురు ఉన్న సమయంలో లక్ష్మి బాంబులు, తాటాకు బాంబులు, మిరపకాయ టపాసులు అంటూ అనేక టపాసులు పేలుస్తూ వాటి నుంచి వచ్చే శబ్దాలను ఆస్వాదిస్తూ సంబరాలు జరుపుకుంటారు. ఆ శబ్దాలకు ఒంట్లో నిగూఢంగా ఉండే ఒక రకమైన బెదురు కూడా పోతుంది అని చెప్పవచ్చు.

సాయంత్రం చీకటి పడ్డాక, ఇంటి బయట దీపాలతో లేదా కొవ్వొత్తులతో ముచ్చటగా అలంకరిస్తారు. ఖాళీ ప్రదేశంలో పిల్లలు పెద్దలు అందరూ చేరుకుని, కాకర పువ్వొత్తిలు, చిచ్చు బుడ్డిలు, భూ చక్రాలు, పాము బిళ్ళలు, తారా జువ్వలు, బాణాసంచులు ఇలా అనేక రకాల టపాసులతో సంబరాలు జరుపుకుంటారు.

Search

Books

Related