ఉగాది (యుగాది) అనగా యుగమునకు ఆది.
బ్రహ్మదేవుడు ఈ సృష్టిని
చైత్ర శుద్ధ పాడయమి నాడు ప్రారంభించారు. ఆ రోజు యుగామునకు ఆది.
ఉగాది పరిపూర్ణమైన తెలుగు పండుగ. హిందూ శాస్త్రం ప్రకారం 60 తెలుగు నామ సంవత్సరాలు కలవు. ప్రతి ఉగాదికి ఒక్కో సంవత్సర నామంతో పిలుస్తారు. ఈ రోజున కొత్త సంవత్సరం, కొత్త నెల (చైత్రం), కొత్త పక్షం (శుక్ల/శుద్ధ), కొత్త తిథి (పాడ్యమి), కొత్త ఋతువు (వసంతం) ప్రారంభం అవుతుంది. వసంత ఋతువు ప్రారంభం కనుక, అప్పటి దాకా ఎండిపోయిన చెట్లు చిగురించడం మొదలవుతుంది. మామిడి కాయలు పుష్కలంగా పండుతాయి.
పండుగకు వారం ముందరే ఇంటికి సున్నం వేసుకుని, ఇంటిని మరియు ఆవరణాన్ని శుభ్రం చేసుకుంటారు. పండుగ నాడు ఇంటి ముందు ఆవు పేడతో అలికి, ముగ్గులు వేసి, అభ్యంగస్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఇంటి ద్వారానికి పచ్చని మామిడి తోరణాలతో అలంకరిస్తారు.
ఇవ్వాళ చేసే
ఉగాది పచ్చడి ప్రత్యేకమైన ఆకర్షణ. జీవితం అంటే అన్ని రకాల అనుభవాలు అని నమ్మి, ఆరు రుచులతో పచ్చడిని తయారుచేస్తారు.
- తీపి (బెల్లం) - ఆనందం
- ఉప్పు (ఉప్పు) - ఉత్సాహం
- చేదు (వేప పువ్వు) - బాధ
- పులుపు (చింత) - నేర్పుగా ఉండాల్సిన పరిస్థితులు
- వగరు (మామిడి) - సవాళ్లు
- కారం (మిరప) - అసహన పరిస్థితులు
కొత్త సంవత్సరం కనుక, ఇష్ట దైవానికి పూజలు చేసుకుని, కొత్త పనులు, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం ఆనవాయితీ. పండితుల ద్వారా
పంచాంగ శ్రవణం చేస్తారు, అనగా ఆ సంవత్సర రాశి ఫలాలను వింటారు . మామిడి కాయలు పుష్కలంగా పండటం వల్ల ఆడవారు ఊరగాయలు తయారు చేస్తారు.