మకర సంక్రాంతి (Pongal)

మకర సంక్రాతి అనగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం చేసే రోజు. ఇలా ప్రతి రాశికి ఒక్కో సంక్రాంతి చొప్పున 12 రాశులకు 12 సంక్రాంతులు కలవు.
తెలుగు, తమిళుల రాష్ట్రాలలో ముఖ్యంగా ఈ పండుగను జరుపుకుంటారు. మొత్తంగా మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. అందువల్ల కొందరు దీనిని పెద్ద పండుగగా కూడా అభివర్ణిస్తారు.
ఇవ్వాళ అభ్యంగస్నానం చేసి, నూతన వస్త్రములు ధరించి, పొంగలి, వడ, పాయసం, అరిసెలు, మురుకులు, సాంబారు (గుమ్మడి, మునగ, ముల్లంగి) మొదలగునవి చేసుకుని, పూజానంతరం తృప్తిగా ఆరగిస్తారు.
ఈ రోజున సూర్యునికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటారు. పితృ పూజలకు శుభ దినము కనుక, పితృ దేవతలకు పిండి పదార్థాలు, కొత్తబట్టలు సమర్పించుకుని వారి ఆశీస్సులు పొందుతారు. కుల దైవమునకు కూడా పూజలు జరుపుతారు. ఇవ్వాళ శివునికి ఆవు నేతితో అభిషేకం చేసి, నువ్వుల దీపాన్ని వెలిగించి, నానబెట్టిన నువ్వులు + బియ్యంతో బెల్లం కలిపి ప్రసాదం తయారు చేస్తారు.
ఈ రోజున చేసే దానానికి విశిష్ఠత కలదు. యశోద సంక్రాంతి రోజున పెరుగు దానం చేసి లోకరక్షకుడు కృష్ణుడిని కుమారునిగా పొందింది. అలాగే ద్రోణాచార్యుని భార్య కృపి, దుర్వాసముని సలహా మేరకు, నువ్వుల పిండితో స్నానం చేసి, పెరుగును దుర్వాసునికి దానం చేసి, గొప్ప యోధుడైన అశ్వత్థామను కుమారునిగా పొందింది. ఇవ్వాళ ధాన్యం, కూరగాయలు, వస్త్రాలు, గోవు, బంగారం మొదలుగునవి దానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది.
ఈ రోజు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా, రంగు రంగుల గాలి పటాలు తయారు చేసుకుని ఒక దగ్గర చేరి, ఉల్లాసంతో ఎగురవేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తారు. ఇవి రాను రాను హింసాత్మకంగా మారడం వల్ల, ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం ఆంక్షలు విధించడం జరిగింది.

Search

Books

Related