దసరా పండుగ హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి. భారత దేశమంతటా జరుపుకునే ఈ పండుగకు 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి మొదలుకుని శుద్ధ నవమి వరకు మొత్తం తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు అంటారు. ఆఖరున పదవ రోజును విజయ దశమి అంటారు. విజయ దశమి నాడు దసరా జరుపుకుంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే ఈ నవరాత్రులను శరన్నవరాత్రి అని కూడా అంటారు. ఈ నవరాత్రులలో మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజులు లక్ష్మీ దేవికి ఆ తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ నవ రాత్రులలో దేవి పూజలు చేయడం వల్ల దేవి నవరాత్రులు అని కూడా అంటారు.
పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు అమరత్వం కోసం మేరు పర్వత శిఖరంపై బ్రహ్మదేవునికి ఘోరమైన తప్పస్సు చేశాడు. కొన్ని వేల సంవత్సరాల తపస్సు అనంతరం బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు మహిషాసురుడు అమరత్వం ప్రసాదించమని వరం అడిగాడు. అప్పుడు బ్రహ్మ అమరత్వం అనేది సృష్టి విరుద్ధం కావున వేరే వరం కోరుకోమన్నాడు. దానికి మహిషాసురుడు ఆలోచించి ఆడది అబల కావున పురుషుని చేతిలో మరణం రాకుండా వరం కోరుకోగా బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించాడు.
ఆ వరంతో గర్వితుడై, దేవతలతో యుద్ధం చేసి ఓడించి ఇంద్ర పదవిని అధిష్టించాడు. దేవతలు త్రిమూర్తులను ప్రార్థించగా, వారి క్రోధాగ్నికి ఒక తేజస్సుగా కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపంగా మారింది. శివుని తేజస్సు ముఖముగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదములుగా కలిగి, మొత్తం 18 బాహువులతో అవతరించింది. మహిషాసురుని వధించడానికి అమ్మవారికి శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల + కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు.
అమ్మవారు భీకర రూపంతో మహిషాసురుని వధించడానికి వెళ్ళగా, మహిషాసురుని సైన్యంతో 9 రాత్రులు భీకరంగా యుద్ధం చేసి అనేక మంది అసురులను అంతం చేసి చివరగా మహిషాసురుని సైతం త్రిశూలంతో వధించింది. ఈ సందర్భంగా మనం దసరాను జరుపుకుంటాం.